Pages

Tuesday, July 5, 2011

Cross roads

               హైదరాబాదు లో ఇప్పుడు  బంద్ జరుగుతోంది.రాష్ట్ర విభజన కోసం  ఆందోళనలు జరుగుతున్నాయి.ప్రజా ప్రతినిదులు రాజీనామాలు  చేసారు. డిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోవడం లేదు.ఈ అనిశిత పరిస్థితి ఎన్నాళ్ళు అని విసుగు గా వుంది.ఇది ఒక  స్వాతoత్ర  ఉద్యమం లాగా  తయారయింది.నిజానికి ఇది అంతా భారత దేశం కదా...ఇది అంతా ఒకే  రాష్ట్రం కదా..అయినా  పరదేశ పాలన లో మగ్గుతున్న ప్రజల లా గా అందరు బాధ పడు తున్నారు. ఎన్నికలు మనకున్నాయి.రాజ్యాంగం   మనకు ఉన్నది.కానీ ఏదో పరదేశపు పాలన లాగా దాని నుంచి విముక్తి కోసం పోరాటం అనీ భావనతెలంగాణా లో బలం గా వుంది.
అయితే హైదరాబాదు లో స్థిర పడిన ఆంధ్రులూ కోస్తా రాయలసీమ శ్రీకాకుళం నుంచి వచ్చి స్థిరా పడిన ప్రజలు అందరూఇది మన రాష్ట్రం అనే అనుకునే స్థిర పడ్డారు.హైదరాబాదు అద్భుతం గా వృద్ధి పొంది
తెలుగు సంస్కృతీ వైభవం వెలిగి పోతుందనే సమయం లో ఈ ప్రాంతీయ కలహాలు అపార్ధాలూ నాకు ఎంతో మనో వేదనని కలిగిస్తున్నాయి.దీని కి కల తప్పు ఒప్పులు నేను విశ్లేషించడం లేదు.ఈ పరిస్థితులు మారి మళ్ళీ తెలుగు వైభవం విశ్వం అంతా తన బావుటా ని ఎగర వేయాలని అందరూ ప్రేమ తో ఐకమత్యం గా వుండాలని 
పక్క నే వున్న తమిళుల లాగా కన్నడిగుల లాగా  మన సంస్కృతి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని    ఒక తెలుగురచయిత గా కోరుకుంటున్నాను!
 
 

 
 

Friday, February 18, 2011

naa kavitha

                                                      నా కవిత...
-------------------------------------------...
                         ఆలోచనలు నీలాకాశం లో 
                          విహరించే  శ్వేత పారావతాలు...
                            ఆదర్శాలు అధిరోహించలేని 
                               ఉన్నత హిమ శిఖరాలు...
                                  అనుభూతులు బతుకును 
                                   పులకింపచేసే పుష్ప మాలికా     
                                       పరిమళాలు...
                                        జ్ఞాపకాలు శరదృతువు లో 
                                          రూపాలు మార్చుకునే 
                                             ధవళ మేఘాలు  
                                             పోరాటాలు 
                                       అకుంటిత

                                              దీక్ష తో గళం  ధరించిన
                                             అగ్ని మాలలు
                                             కవనాలు మనసు  
                                               విహరించే సుందర 
                                                  పుష్ప వనాలు..
                                           కవితలు నా హృదిని 
                                           వెన్నంటి వీడని వెతలు...
                                               గీతాలు ఖాళీ 
                                            మందిరాలలో
                                    ప్రతిధ్వనించే  ప్రియ              మధురహాసాలు 
                   చూపులు దిగంతాల్లో ఉదయించే సూర్య బింబాలు 
                   ఆశలు ఆరాటాలు స్మృతులు 
                     పడి లేచిన సముద్రపుటలలు
                      ప్రియ భాషణాలు నిశబ్దం అయిన  క్షణాలు 
                      గుండె ని చీల్చిన క్రూరపు  నిర్లక్ష్యాల
                          కత్తులు...
                  ఆ బాధలు మనసు నీ  శరీరాన్నీ విధ్వంసం 
             చేసిన చిత్ర తూణీరాలు 
          అన్నిటినీ మరిచీ  మరువక ప్రశాంతత లో

           నెమరువేసేదే  నా కవిత్వం ...
                అందుకే నా భావాలు స్వేచ్చా విహంగాలు
               నా అక్షరాలు సెల్ ఫోను లో మాట్లాడుతూ 
               చిరునవ్వులు నవ్వే ఆడ పిల్లలు...

(అవును నాకు తిలక్ అభిమాన కవి)
                 

 
   

 
   

Wednesday, February 16, 2011

thappadu

                                          తప్పదు
                             అనంతం లో సాగిపోయే

                                 అణువులం మనం 
                                     అనుభూతులు వేరయినా 
                                   ఆకారాలు మారినా 
                                        ప్రాణం పోసుకున్నఎలక్ ట్రానులం
                                          అంతం అయినా అంతం లేదు.
                                             ఈ శరీరం  బూడిద అయినా 
                                             మరో రూపం లో అస్తిత్వం తప్పదు 
                                                    విశ్వం లో ఉనికి తప్పదు!
                                                          సృష్టి లో మనం కూడా 
                                                              అంతు లేని అనంత
                                                                  ప్రయాణం చేయాల్సిందే!
                                                                సృష్టి లా  సృష్టించిన 
                                                                   దేవుడి లా 
                                                                       మనకి కూడా 
                                                                       అంతం లేదు  అనంతం 
                                                                             తప్పదు.

Tuesday, February 15, 2011

FiZa

      ఫిజా..

                   మెరిసే రంగుల పూత లోంచి 
                        అస్పష్టం గా అతివల ఆకారాలు,
                          అవి మౌనం గా నే  నీ తో మాట్లాడుతూ 
                               నిన్ను శాశిస్తున్నట్లుంటాయి.
                                గీతల అల్లిక లో
                                   అద్భుతమైన ఇంద్రజాలం...
                                     అవి కదలక పోయినా ...
                                         కదుల్తున్నట్లు నిన్ను మోహిస్తాయి 
రంగుల్లో సింఫనీ లు, వాటి భాషల్లో కావ్యాలు...!
గీతలు రంగుల్లో కలసిపోయి  అద్భుత అను భూతి ని కలిగించే ఏం ఎఫ్  హుస్సేన్ హస్తజాలం ...
కేన్వాస్ లోంచి సముద్ర ఘోష...ప్రేయసి కళ్ళ లోంచి  
గుండె కి చేరే పాట...
ఆకృతులు, వర్ణాలు, రేఖలు,వృత్తాలు గీతలు, చతురస్రాలు,
నీలి అరుణం లోంచి గ్రే  కలసిన పసుపు ముద్దలు,
నలుపు తెలుపు ల మధ్య 
స్త్రీ ఆకృతీ  నుదురూ... ఆ మధ్య 
సూర్య బింబం లా యెర్రని చుక్క ,కనురెప్పల కాటుక 
సన్నాయి ముందు ఆడే గంగి రెద్దు గజ్జల చప్పుడు ...
నీ రంగుల సముద్రం లో ఇన్ని చలన చిత్రాలా?...




                         

Wednesday, January 19, 2011

aalochanalu

కొత్త సంవత్సరం  మొదలయింది.అనుకున్నట్లుగా ఏ గొడవలూ జరగలేదు.కానీ రాజకీయ అనిశ్చిత పరిస్థితి కొనసాగుతూనే వుంది.న్యు ఇయర్  అయిపొయింది,సంక్రాంతి అయిపోయినది.కానీ మన రాష్ట్ర  భవిష్యతు  ఎలా వుంటుందో  ఎవరికీ  అర్ధం కాని పరిస్థితి.మిగిలిన రాష్ట్రాలు ప్రగతి పధం లో దూసుకు పోతుంటే మనం మనలో  కొట్టుకుంటూ తిట్టుకుంటూ  కాల క్షేపం చేస్తూ ఉన్నాము. ఈ మధ్య  కాన్ఫరెన్సు కోసం అహమ్మదాబాదు వెళ్ళాను.అది ఒక డాక్టర్ల  కాన్ఫరెన్సు.గుజరాతు ఎంత  ముందుకు వెళ్తోందో  అనిపించింది.
నా సీరియల్ నవల "కుజుని కోసం "రచన లో మొదలయింది.తెలుగు లో సైన్సు సాహిత్యం అంతరిక్ష సాహిత్యం రాసే సాహసం చేసాను.పాటకులు 
  విమర్శకులు ఏమంటారో అని ఆత్రుత గా వుంది.మీరు  వీలుంటే చదవండి! 
నా కధలు కొత్త గా వచ్చే అపరాధ పరిశోధన  అనే మాస పత్రిక లో  కూడా  రాబోతున్నాయి. మిస్టరీ  హార్రర్  ఇష్టం వుంటే  నా ఆనంద భవన్ కధా చదవండి.
ఇదీ ఇలా  వుండగా వంశీ కధలు టెలివిజన్ లో సీరియల్ గా వస్తున్నాయి..మా T  వీ లో .ఆయన రాసిన వన్నీ  గొప్ప కధలు .ఉన్నతమైన స్థాయి లో ఉన్నాయి వాటికి బాపు బొమ్మలు అద్భుతం గా వేసారు .చూడండి..చదవండి. 

Wednesday, December 29, 2010

new year

 ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం  మొదలవబోతోంది.
మన రాజధాని లో అందరి మనసులో ఒకటే అనుమానం."గొడవలు  జరుగుతాయట...ఎలా వుంటుందో ఏమో" 
ఎంతో అద్భుతం  అయిన ప్రగతి పధం లో వెళ్ల వలసిన  రాష్ట్రం ...ఎంతో సంస్కృతి  చరిత్ర కలిగిన ప్రజలూ భాష  సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం మనది.ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా మనకు  తెలుగు వాళ్ళు కనిపిస్తూనే వ ఉంటారు.ఉన్నతమైన  సంస్కారం కల జాతి మనది. ఇలా రెండు  సంవత్సరాల నుంచి మనం మనలో పోట్లాడు కుంటూ తిట్టు కుంటూ ఉన్నాము .రెండు రోజుల తరవాత ఏమి జరుగుతుందో అనే  ఈ స్థితి   ఎన్నాళ్ళు?ఎవరో పరభాషా సంస్కృతి కి చెందిన కేంద్ర ప్రభుత్వ కమిటీ  లు మన బాధ ని ఎలా అర్ధం చేసుకుంటాయి? లేక నిజం గానే  ఈ సమస్య కి త్వర లో నే అందరికీ ఆమోద యోగ్యం అయిన  పరిష్కారం దొరుకుందా?  భగవంతుడిని ప్రార్దిద్దాము .
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Saturday, December 25, 2010

kotha samvatsaram

కొత్త సంవత్సరం వస్తోంది.ఏమి జరుగుతుందో అనే భయం  అంతర్గతం  గా  అందరికి వుంది.రోడ్లు  బ్లాక్ చేస్తారా?జన జీవనం  స్తంభింప జేస్తారా? కొత్త సంవత్సరం లో రాష్ట్ర విభజన జరుగుతుందా ? అంతా  సస్పెన్సు గా వుందంటే  నమ్మండి.అన్నిటి కంటే  యూస్ లెస్  శాస్త్రం  జ్యోతిషం  అని అనిపిస్తోంది.ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా  చెప్పలేని భవిష్యతు  మనది .మన తెలుగు దేశానిది. అందరికీ ఆమోగ్యం అయిన  పరిష్కారం ఏమయి ఉంటుంది సార్?  చెప్పండి!  ఏది చేసినా ఎవరో ఒకరికి  కోపం రాక తప్పదు.
వేచి చూద్దాం. 

My Blog Visitors